: మీ పార్టీలకు మీరే రారాజులు.. మీ అభిప్రాయం చెప్పండి: సీఎం పిలుపు
శాసనసభలో చర్చను అడ్డుకుంటూ విభజనకు టీడీపీ, వైఎస్సార్సీపీలు సహకరిస్తున్నాయని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ పైనా, కేంద్రం పైనా తాము పోరాడుతూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు చెబుతుంటే.. టీడీపీ, వైఎస్సార్సీపీలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. తమది జాతీయపార్టీ అయినందున తమకు నిర్ణయం తీసుకునే అధికారం లేదని.. టీడీపీ, వైఎస్సార్సీపీల అధినేతలే ఆయా పార్టీలకు రారాజులని, వారి నిర్ణయమే అంతిమ నిర్ణయమని ఆయన తెలిపారు. అందుకే అసెంబ్లీలో మీమీ నిర్ణయాలు చెప్పి విభజన బిల్లుపై కేంద్రం పునరాలోచించేలా చేయండని ఆయన పిలుపునిచ్చారు.
బిల్లుపై చర్చించలేదంటే దానిని ఆమోదంగా పరిగణించే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. శాసనసభలో అభిప్రాయం చెప్పకపోతే వైఎస్సార్సీపీ గతంలో సూచించినట్టు ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరిగే అవకాశం ఉందని, అలాంటి ప్రమాదం రాకుండా చర్చలో పాల్గోవాలని టీడీపీ, వైఎస్సార్సీపీలకు సూచించారు. అసెంబ్లీలో ప్రజాభీష్టాన్ని ప్రతిబింబింపజేసి విభజనను అడ్డుకోవాలని ఆయన కోరారు. రెండు ప్రాంతాలకు తీవ్ర నష్టం చేకూర్చే బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.