: అక్కినేని రోజూ ఏం చేస్తున్నారు?
సినీ పరిశ్రమ పెద్ద దిక్కు అక్కినేని నాగేశ్వరరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్తలతో అభిమానులందరూ ఆవేదనకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్యం బాగుందని అక్కినేని నాగార్జున తెలిపాడు. ఫేస్ బుక్ లో అభిమానుల కోసం ఆయన చాలా వివరాలను పొందుపరిచాడు. అందులో తన తండ్రి ఆత్మ విశ్వాసం చాలా గొప్పదని చెప్పాడు. చివరిసారిగా తన తండ్రి మీడియాతో ఏది మాట్లాడారో... దాన్ని సాధించి తీరుతారని తెలిపాడు.
జనవరి ఫస్టున కుటుంబ సభ్యులమందరం కలసి చాలా ఆనందంగా గడిపామని నాగ్ చెప్పాడు. ప్రతిరోజు కూడా తన తండ్రి తనకు ఇష్టమైన టీవీ కామెడీ ప్రోగ్రాంలు చూడటం, పాటలు వినడం, తను చూడని సినిమాలు (పాతవే కాకుండా కొత్త సినిమా ఉయ్యాలా జంపాలా వరకు) చూడటం చేస్తున్నారని తెలిపాడు. అంతేకాకుండా రాజకీయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఆయన ప్రతి రోజు క్షుణ్ణంగా వార్తాపత్రికలు చదువుతారని చెప్పాడు.