: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అస్వస్థత
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (90) అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో, తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం ఒడిదుడుకులకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాగా రెండురోజుల కిందట ఆయన బాగా నీరసపడి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని తన నివాసానికే ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వచ్చి చికిత్సనందిస్తున్నారు. ఆయన కుమారుడైన ప్రముఖ సినీ హీరో నాగార్జున, ఇతర కుటుంబసభ్యులు ప్రతి రోజూ ఆయన ఇంటికి వచ్చి కొన్ని గంటలపాటు అక్కడే ఉండి వెళుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్యానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.