: అల్లంత దూరాన మన భూమిలాంటి గ్రహం!


అంతరిక్షంలో సుదూరాన మన భూమిలాంటి ఒక గ్రహాన్ని పరిశోధకులు గుర్తించారు. మన భూమిలాగే ఆవాసయోగ్యంగా మరేవైనా గ్రహాలు సౌరకుటుంబంలో గానీ, అంతరిక్షంలోని మరే ఇతర నక్షత్ర కూటమిలో గానీ వున్నాయా? అనే దిశగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన భూమికి సుమారు రెండు వందల కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి ఒక గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం అత్యధిక వాయువులను కలిగి, భూమికి సమానమైన ద్రవ్యరాశితోను, భూమికన్నా కూడా అరవై శాతం అధిక వ్యాసంతోను ఉంది.

నాసాకు చెందిన కెఫ్లర్‌ వ్యోమనౌక ఆధారంగా హార్వర్డ్‌`స్మిత్‌సోనియన్‌ ఖగోళ భౌతికశాస్త్ర కేంద్రం పరిశోధకులు ఈ గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. దీనికి కేఓఐ`314సీ అనే సంకేతనామం పెట్టారు. ఈ గ్రహంలో అత్యధికస్థాయిలో వాయువులు నిండివున్న కారణంగా ఈ గ్రహం భూమికన్నా అత్యధిక వ్యాసం కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సరికొత్త గ్రహం ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఇది ఒకసారి ఆ నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి దానికి కేవలం 23 రోజులు మాత్రమే పడుతుంది. ఈ గ్రహంలో ఉష్ణోగ్రత 104 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉంటుందని, ఇలాంటి వేడిగల గ్రహంలో జీవం ఉనికిలో ఉండే అవకాశం లేదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్‌ కిప్పింగ్‌ చెబుతున్నారు. అంతేకాదు, ఈ గ్రహం చుట్టూ హైడ్రోజన్‌, హీలియం వాయువులతో కూడిన వాతావరణం కొన్ని వందలమైళ్ల మందంతో ఉందని డేవిడ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News