: చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: రామచంద్రయ్య
బిల్లు పూర్తి అసమగ్రంగా ఉందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, అసమగ్రంగా ఉన్న బిల్లుపై చర్చించి ఏమి సాధిస్తామని ప్రశ్నించారు. బిల్లులో ఏ అంశాన్నీ సమగ్రంగా పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు. ఎంత సేపూ బిల్లుపై చర్చ జరగాలి అంటున్నారని... బిల్లులోని విషయాలపై అవగాహన ఉండాల్సిన అవసరం లేదా? అందులోని విషయాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా? ఇది చర్చించాల్సిన బిల్లా? లేక చర్చ పూర్తయ్యాక పంపిన బిల్లా? అని ఆయన సందేహం లేవనెత్తారు.
ముందుగా రాష్ట్రంలో ఉన్న వనరులు, జరిగిన ఉల్లంఘనలు, నోచుకున్న అభివృద్ధి, విభజనకు ప్రాతిపదిక, పంపకాల వివరాలు తదితర అంశాలన్నీ అందుబాటులో ఉంటే అప్పుడు దానిపై చర్చించేందుకు అవకాశం ఉంటుందని, ఇప్పుడు వచ్చిన బిల్లుపై చర్చించి ఏం సాధిస్తారని మంత్రి రామచంద్రయ్య అన్నారు.