: తిరుపతిలో అటవీ సిబ్బందికి ఆయుధ శిక్షణ
చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాల వాడకంపై శిక్షణనిస్తున్నారు. తిరుపతికి సమీపంలోని కళ్యాణదుర్గం వద్ద పోలీసు శిక్షణా కేంద్రంలో ఈ నెల 22 వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. శిక్షణ కార్యక్రమ వివరాలను తిరుపతి డివిజనల్ అటవీ అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయుధాల వినియోగంపై శిక్షణనిస్తారు. పలు అటవీ చట్టాల్లో యాక్ట్ లు, సెక్షన్లకు సంబంధించి మౌఖిక తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే దేహ దారుఢ్యానికి సంబంధించిన అంశాలపై కూడా తర్ఫీదునిస్తారు. ఎర్రచందనం స్మగ్లర్లను ఎదుర్కొనడానికి సిబ్బందికి ఆయుధాలను ఇవ్వాలని ప్రతిపాదన ఉన్నా అది అమలుకు నోచుకోలేదు. ఇటీవల ఎర్రచందనం దొంగలు ఇద్దరు పోలీసు సిబ్బందిని హతమార్చడంతో ఆయుధాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఆయుధాల వాడకంలో సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు వీలుగా, ఇప్పుడు అటవీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి దశలో 70 మందికి శిక్షణ ఇస్తున్నామని, మిగిలిన సిబ్బందికి జనవరి 27వ తేదీ నుంచి రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు డి.ఎఫ్.వో శ్రీనివాసులు తెలిపారు.