: ఆరురోజుల్లో క్యాన్సర్‌ను తరిమేయచ్చు!
కేన్సర్ వ్యాధిని ఆరు రోజుల్లోనే నిర్మూలించగలిగే కొత్తరకం మందును అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేన్సర్‌లలో ఒకరకమైన పాంక్రియాటిక్ కేన్సర్‌ని ప్రారంభంలో గుర్తించడం కష్టం. తీరా గుర్తించాక దాన్ని నివారించడం మరీ కష్టం. ఇలాంటి పాంక్రియాటిక్ కేన్సర్‌ను కేవలం ఆరే రోజుల్లో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి శక్తిమంతమైన కొత్తమందును తాము కనుగొన్నామని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కేన్సర్‌ను నిర్ధారించే పరీక్షలతో పాంక్రియాటిక్ కేన్సర్‌ను గుర్తించడం కష్టం. గుర్తించిన తర్వాత అది మామూలు చికిత్సలకు లొంగడం లేదని బ్రిటిష్ శాస్త్రవేత్తలు తెలిపారు. పాంక్రియాటిక్ కేన్సర్‌ను నిర్మూలించడానికి తాము అభివృద్ధి చేసిన మందు చక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్లెరిక్సాఫర్ అనే మందు కేన్సర్ కణాల చుట్టూ ఉండే రక్షణ వలయాన్ని (కెమోకైన్ ప్రొటీన్) ఛేదిస్తుందని, దీంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించడం వ్యాధి నిరోధక కణాలకు సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. అయితే క్యాన్సర్ చికిత్సలో ఈ మందును వ్యాధినిరోధక శక్తిని పెంచే ఇతర మందులతోబాటు వాడాలని వారు తెలిపారు. ఈ మందు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరించారు.