: బీసీసీఐ, రాజస్థాన్ క్రికెట్ బోర్డు యుద్ధంగా మారిన వ్యక్తిగత వైరం!
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలను ఈ నెల 17 వరకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 11 రోజులపాటు లలిత్ మోడీ తన భవితవ్యంపై నిర్ణయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు లలిత్ మోడీ దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారం. అయితే లలిత్ మోడీని ఎన్నుకుంటే రాజస్థాన్ ను నిషేధిస్తామని బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్ వర్గం హెచ్చరిస్తోంది. కాగా రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రుంగ్తా రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్ ను సవాలు చేస్తూ కేసు దాఖలు చేశారు. ఇదే కేసులో బీసీసీఐ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.
గతంలో ఐపీఎల్ నిర్వహణ సందర్భంగా లలిత్ మోడీ ఆర్థికనేరాలకు పాల్పడ్డారని బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు జీవితకాల నిషేధం విధించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం లేదు. రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్ లోని వెసులుబాటు మేరకు ఆయన పోటీ చేశారు. లలిత్ మోడి, శ్రీనివాసన్ మధ్య యుద్ధం రాజస్థాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య యుద్ధంగా మారిపోయింది.