: ఆమ్ ఆద్మీపై కొండంత ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
రాజకీయాలు ప్రజాసేవ కోసమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్న నయా పార్టీ ఆమ్ ఆద్మీ. ఢిల్లీలో ఈ పార్టీ విజయాలను చూసి బీజేపీ కంటే కాంగ్రెస్ వెన్నులోనే ఎక్కువగా వణుకు పుట్టింది. కానీ, అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీపైనే కొండంత ఆశలు పెట్టుకుంది. ఢిల్లీవలే దేశంలోని పట్టణాల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బ్రేకులు వేస్తుందని.. ఓట్లను చీల్చడం వల్ల తమకు విజయావకాశాలు పెరుగుతాయని ఆశిస్తోంది. దేశవ్యాప్తంగా సాధ్యమైనన్ని లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ ప్రకటించిన విషయం తెలిసిందే.
వరుస అవినీతి కుంభకోణాలు, అసమర్థత కారణంగా పట్టణాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారుపై వ్యతిరేకత కనిపిస్తోంది. మొన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. నిజానికి ఎప్పటి నుంచో కాంగ్రెస్ వినిపిస్తున్న ఆమ్ ఆద్మీ పేరుతోనే పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఓట్లకు చిల్లుపెడుతుందా.. కాంగ్రెస్ ఓట్లకు కన్నం వేస్తుందా.. ఈ పార్టీ వల్ల కాంగ్రెస్ లేదా బీజేపీలో దేనికి ప్రయోజనం చేకూరుతుంది? అన్నది వేచి చూడాలి.