: మన వాళ్లకు కూడా ఈ అలవాటు వస్తోందట
ఇప్పటి వరకూ పాకెట్ మనీ సంస్కృతి మనదేశంలో అంతగా లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి మనదేశానికి కూడా వ్యాపిస్తోందట. అయితే ఎలాగంటే... పరీక్షల్లో పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే వారికి బహుమతిగా డబ్బును ఇస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ఐఎన్‌జి వైశ్యాబ్యాంక్ చేసిన ఆన్‌లైన్ సర్వేలో భారతీయ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే వారికి డబ్బు రూపంలో బహుమతిని ఇస్తున్నట్టు స్పష్టమైంది.
ఈ ఆన్‌లైన్ సర్వేలో వెయ్యిమంది తల్లిదండ్రుల జంటలు పాల్గొనగా, అందులో అరవై శాతం మంది జంటలు నగరాల్లో నివసించేవారు. పశ్చిమ దేశాల్లో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటి పనుల్లో తమకు సహాయం చేసినందుకుగానూ వారికి పాకెట్ మనీ అందిస్తారని, అయితే మనదేశాల్లో పాకెట్ మనీ సంస్కృతికి వ్యతిరేకమైనా, ఇప్పుడిప్పుడే ఈ అలవాటు మనదేశానికి కూడా విస్తరిస్తోందని ఐఎన్‌జి తెలిపింది.
పిల్లలు తమకు డబ్బు అవసరం ఏర్పడినప్పుడు తల్లిని అడగడానికే ఇష్టపడుతున్నారని ఈ సర్వేలో పాల్గొన్న 73 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారట. అలాగే పిల్లల పేరున ఫిక్సెడ్ డిపాజిట్లు చేయడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని 60 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారట. అలాగే పిల్లలకు చిన్నతనం నుండే డబ్బు ఆదాచేయడం నేర్పించాలని, ఇది మంచి అలవాటని, దీన్ని పిల్లలు తప్పనిసరిగా అలవరచుకోవాలని 70 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.
అంతేకాదు, పిల్లలకు డబ్బు నిర్వహణ పద్ధతులు తెలియాలని, ఇందుకోసం పిల్లలకు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని ఆశిస్తున్నట్టు 52 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారట. పిల్లల కోసం బ్యాంక్ ఖాతాలను ప్రారంభిస్తున్నట్టు 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారట. అంతేకాదు పిల్లల పేరుమీద డిపాజిట్లు చేయడం అనేది తమ బాధ్యతగా చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారట.