: రంగు రంగుల పట్టుదారాలు రానున్నాయి
ఇప్పటి వరకూ పట్టు అంటే ఒకే రకమైన తెలుపు రంగుతో ఉండేది. దానికి మళ్లీ రంగులద్ది కళాత్మకంగా పట్టు చీరలను నేసేవారు. ఇకపై అలాకాకుండా చక్కగా రంగు రంగుల పట్టు దారాలనే పట్టు పురుగులు ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పరిశోధకులు పట్టుపురుగులకు రంగు రంగుల ఆహారాన్ని ఇవ్వడంతో చక్కగా పట్టుపురుగులు కూడా రంగురంగుల దారాలను ఇచ్చాయట.
సాధారణంగా బట్టలను తయారుచేసిన తర్వాత వాటికి రకరకాల రంగులను అద్దుతారు. ఇవన్నీ కూడా కెమికల్స్ కలిపి ఉంటాయి. ఇలాంటి రంగుల బట్టలను ఉతికినప్పుడు వాటినుండి హానికారక వ్యర్ధాలున్న నీరు వెలువడి పర్యావరణం కలుషితం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూణెలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అనూయ నిసాల్, కనికా త్రివేది పర్యావరణ హితాన్ని కలిగించే కొత్తరకం రంగు రంగుల పట్టు దారాన్ని తయారుచేశారు.
వీరు ప్రయోగశాలల్లో పట్టుపురుగులకు ఆహారంగా ఇచ్చే మల్బరీ ఆకులపై రంగులను చల్లుతారు. అలాంటి రంగుల ఆకులను తినడం వల్ల పట్టు పురుగులు చక్కగా రంగు రంగుల దారాన్ని ఇచ్చాయట. ఇప్పటి వరకూ ఒకే రకమైన రంగు దారాన్ని మాత్రమే తయారుచేశామని, అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇప్పుడు దుస్తుల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న అజోడైల వారు దీనివైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏడు రంగులతో పరిశోధకులు ప్రయోగాలు చేశారు. మరో విశేషం ఏమంటే... రంగు ఆకులను తిన్న పురుగులకు ఎలాంటి హాని జరగలేదు, పైగా ఈ రంగు దారాలు పర్యావరణ హితం కూడా అని పరిశోధకులు చెబుతున్నారు.