: నిప్పులు చిమ్ముతూ ... నింగికెగసిన జీఎస్ఎల్ వీ-డీ5


భారత అంతరిక్షపరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన కీలకమైన జియో సింక్రనన్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్ వీ-డీ5) నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో సాయత్రం 4.18నిమిషాలకు 1980 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-14ను మోసుకుని అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఈ ఉపగ్రహ నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

తొలి దశ దూరాన్ని విజయవంతంగా జీఎస్ఎల్ వీ-డీ5 పూర్తి చేసింది. దీంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 205 కోట్ల రూపాయలతో జీఎస్ఎల్ వీ లాంచ్ వెహికల్స్ ను షార్ రూపొందించింది. అందులో భాగంగా ఈ ఉపగ్రహాన్ని 2013 ఆగష్టులోనే ప్రయోగించాల్సి వుండగా, సాంకేతిక కారణంగా వాయిదా వేశారు. 7020 అనే ప్రత్యేక అల్యూమినియం లోహంతో తయారైన ఇంధన ట్యాంకు పగలడంతో, దానిని సరి చేసి ఇప్పడు విజయవంతంగా ప్రయోగించారు.

జీఎస్ఎల్ వీలో దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ ను వాడుతున్నారు. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవఇంధనాన్ని, మూడో దశలోని క్రయోజనిక్ ఇంజన్ లో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ లను మండించి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకోవడంతో శాస్త్రవేత్తలు పూర్తి సర్వసన్నద్దంగా ప్రయోగం నిర్వహించారు. ఇస్రో చరిత్రలో ఇది 105 వ ప్రయోగం కాగా జీఎస్ఎల్ వీ సిరీస్ లో 8 వ ఉపగ్రహం.

  • Loading...

More Telugu News