: కడుపునిండా టిపినీలు తినాలట!
సమయం లేకపోవడం వల్లనో, లేదా టిఫిన్ చేస్తూ కూర్చుంటే టైమ్ అయిపోతుందనో ఇలా ఏదో ఒక కారణంతో మనలో చాలామంది టిఫిన్లు చేయరు. ముఖ్యంగా మహిళలైతే టిఫిన్ చేయడాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇలాంటివారు మాత్రం కచ్చితంగా ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఉదయం పూట కడుపారా టిఫిన్ లాగించాల్సిన అవసరం అందరికీ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునేవారు మాత్రం ఉదయం పూట కచ్చితంగా కడుపారా టిఫిన్లు లాగించాలని పరిశోధకులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట టిఫిన్ చేయడం మానేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట తక్కువగా భోజనం తీసుకుని ఉదయం పూట భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం సమస్య రాదని టెల్ అవీన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.
టిఫిన్ కడుపునిండా తినేవారి ఆరోగ్యం అన్నివిధాలుగా బాగుంటుందని, వారిలో చెడు కొలెస్టరాల్ పేరుకునే సమస్య ఉండదని, అంతేకాకుండా ఇలాంటి వారికి మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫెసర్ డేనియల్ జాకుబోవిచ్, అమె సహచరులు స్థూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అల్పాహారం, మరికొందరికి అధికంగా రాత్రిపూట ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. వారిలో అల్పాహారం ఎక్కువగా తీసుకున్నవారు బరువు తగ్గి చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి కడుపారా టిపినీలు చేయండి, చక్కగా బరువు తగ్గండి.