: నరులకే కాదు... వానరులకూ సురక్షిత నిద్ర కావాలి


మనం రాత్రి నిద్రించడానికి ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని నిద్రిస్తాం. మామూలుగా అయితే ఇంట్లో క్షేమంగా ఉంటుంది. అలాకాకుండా బయటి ప్రదేశాలకు వెళ్లామంటే ఎక్కడబడితే అక్కడ నిద్రపోలేము. ఎక్కడో సురక్షితంగా ఉండే ప్రాంతంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తాము. అయితే ఈ అలవాటు కేవలం మనుషులకే కాదట... కోతులకు కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలో తేల్చారు. వానరాలు రాత్రిపూట నిద్రపోవడానికి సురక్షితమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని రోజూ అక్కడికే క్రమం తప్పకుండా వచ్చి నిద్రపోతుండడాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మడగాస్కర్‌లోని రింగ్‌ టెయిల్డ్‌ లీమర్స్‌ అనే రకమైన వానరాలు రోజూ నిద్రపోవడానికి క్రమం తప్పకుండా ఒకే గుహకు వెళ్లడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిషెల్లీ సాథర్‌ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో రాత్రివేళ నిద్రించడానికి దీర్ఘకాలంపాటు ఒక సురక్షితమైన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం అనే లక్షణం వానరాల్లో కూడా ఉందని తొలిసారిగా తేలింది.

ఈ విషయం గురించి మిషెల్లీ మాట్లాడుతూ శత్రువుల బారినుండి రక్షించుకోవడానికి, చలి, వేడి వంటి వాతావరణం నుండి శరీర ఉష్ణోగ్రతను ఒకేవిధంగా ఉండేలా నియంత్రించుకోవడానికి, అడవుల కొట్టివేత వంటి మానవ కార్యకలాపాల వల్ల ఆవాసాల విధ్వంసం జరిగినా కూడా వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవడానికి అవి ఇలాంటి అవసరాలకోసం లీమర్స్‌ ఒకే గుహను ఎంపిక చేసుకొని ఉండవచ్చని, అవి ప్రతిరోజూ ఒకే గుహకు వెళుతున్నప్పటికీ ఆరేళ్లపాటు తాము జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని తొలిసారిగా గుర్తించడం జరిగిందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో బాబూన్లనే వానరాలు కూడా గుహల్లోనే పడుకుంటాయని మిషెల్లీ తెలిపారు.

  • Loading...

More Telugu News