: 16లోగా ఓటర్ల జాబితాలు ప్రచురణ: భన్వర్ లాల్
ఈనెల 16వ తేదీలోగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు (శనివారం) జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 13వ తేదీలోగా రెండు ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల పేర్లను తొలగించాలని, అలాగే మరణించిన ఓటర్ల పేరు కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రతినిధుల బృందాలు సమర్పించిన వినతి పత్రాల మేరకు ఓటర్ల జాబితాలో సవరణలు 18 శాతం పరిష్కారమయ్యాయని ఆయన అన్నారు. అయితే.. ఇప్పటికీ 86 శాతం సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణలను జనవరిలోనే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 14 మంది పరిశీలకులను రాష్ట్రానికి పంపుతోందని భన్వర్ లాల్ తెలిపారు.