: తన విగ్రహం ఏర్పాటులో రాజ్ నాథ్ సాయాన్ని కోరిన హజారే
మీరు వింటున్నది నిజమే! నిరాడంబరుడు, సమాజం కోసం ఉద్యమిస్తూ జీవిస్తున్న అన్నా హజారే తన విగ్రహ ఏర్పాటు విషయంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సాయాన్ని అర్థిస్తూ ఒక లేఖ కూడా రాశారు. 'నా విగ్రహ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. కానీ, నాతో ఎప్పటి నుంచో లోక్ పాల్ ఉద్యమంలో పాల్గొన్న పీఎల్ కటారియా అనే ఒక కార్యకర్త, అతని బృందం హర్యానాలోని గుర్గావ్ లో నాలుగు రోడ్ల కూడలిలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. కానీ, బీజేపీకి చెందిన ఒక నేత దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కనుక ఈ విషయంలో సహకరించండి' అని లేఖలో హజారే కోరారు.
దీంతో అన్నా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న కటారియాతో రాజ్ నాథ్ తన నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ హర్యానా అధికార ప్రతినిధి ఉమేష్ అగర్వాల్ విగ్రహ ఏర్పాటును నకిలీ ఫిర్యాదుతో అడ్డుకుంటున్నారని హజారే అభిమాని ఒకరు తెలిపారు. దీనిపైనే హజారే రాజ్ నాథ్ కు లేఖ రాశారని వివరించారు. ఉమేష్ ఫిర్యాదుతో కటారియా సహా నలుగురిని పోలీసులు గతేడాది అరెస్ట్ కూడా చేశారని తెలిపారు. మొత్తానికి ఉమేష్ అగర్వాల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు.