: పది నిమిషాల్లో మొబైల్ మనీ ఆర్డర్


బంధువులు, స్నేహితులు, కావాల్సిన వారికి డబ్బులు పంపించుకోవాలన్నా, అందుకోవాలన్నా ఒకప్పుడు మనీ ఆర్డరే కొండంత అండ. దూర తీరాలలో ఉన్న వారి దగ్గరకు మనీ ఆర్డర్ రూపంలో ధన లక్ష్మి నడుచుకుంటూ వెళ్లేది. కానీ, ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో మనీ ఆర్డర్లకు ఆదరణ తగ్గిపోతోంది. కారణం, పోస్టల్ శాఖ కాలంతోపాటు మారకపోవడమే. కానీ, మళ్లీ మనీ ఆర్డర్లకు ఆదరణ పెరిగే రోజులు రాబోతున్నాయి. 

వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో మొబైల్ ద్వారా మనీ ఆర్డర్ పంపుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్ లో ఈ రోజు మీడియాకు వెల్లడించారు. అలాగే, ఉత్తరాల బట్వాడాలో ఆలస్యాన్ని నివారించేందుకు హైదరాబాద్ లో ఆటోమేటెడ్ మెయిల్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక గిరిజన ప్రాంతాలలో సమాచార సదుపాయాల విస్తరణ కోసం 227 మొబైల్ టవర్లు నెలకొల్పుతామని, శ్రీకాకుళం, విశాఖ, రంగారెడ్డి జిల్లాలలో ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్స్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. 

పోస్టల్ శాఖ ఇప్పటికే ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ ఫర్ విధానాన్ని అందిస్తోంది. దీనికంటే మొబైల్ మనీ ఆర్డర్ విధానమే ఎక్కువ మందికి సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే, నేడు దాదాపు అందరి వద్దా మొబైల్ ఫోన్లున్నాయి. కనుక ఈ విధానంలో ఎవరికైనా డబ్బులు పంపుకోవాలంటే దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి డిపాజిట్ చేసి, అవతలి వారి నంబర్, వివరాలు ఇస్తే చాలు. మీరు అలా డిపాజిట్ చేశారో లేదో... ఇలా వెంటనే అవతలి వారికి మేసేజ్ వెళుతుంది.

 అందులో ఉన్న సీక్రేట్ కోడ్ ను సమీపంలోని పోస్టాఫీసులో చూపించి డబ్బులు పుచ్చుకోవచ్చు. పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందట. అయితే, ఈ విధానం ద్వారా కనీసం 1000 రూపాయలు పంపించాల్సి ఉంటుందని పోస్టల్ వర్గాల సమాచారం. 1500 రూపాయలకు 40 రూపాయలు కమిషన్ గా వసూలు చేస్తారు. 1500 నుంచి 5000 వరకూ 70 తీసుకుంటారు. ఆపై 10వేల రూపాయల వరకూ 100 రూపాయలు చార్జ్ చేస్తారు. ఇందుకోసం పోస్టల్ శాఖ బీఎస్ఎన్ఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ప్రారంభంలో ఇది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకే అందనుంది. 

  • Loading...

More Telugu News