: ఆర్ బీఐ పేరుతో ఆన్ లైన్లో మోసగాళ్లు
కేటుగాళ్లు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) పేరుతో నెట్ వినియోగదారులను మోసగించడానికి రెడీ అయ్యారు. ఆర్ బీఐ పేరుతో దొంగ మెయిళ్లు పంపిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించే పనిలో పడ్డారు. అందుకే ఆర్ బీఐ పేరుతో వచ్చే మెయిళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
''ఆర్ బీఐ కొత్త సెక్యూరిటీ విధానాన్ని ప్రారంభించింది. ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి'' అని ఆ మెయిల్ లో ఉంటుంది. లింక్ పై క్లిక్ చేస్తే మీ బ్యాంకు పేరు అడుగుతుంది. అది కూడా ఇచ్చేస్తే నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ కూడా ఇవ్వమని సూచిస్తుంది. ఇచ్చిన నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునంతా కేటుగాళ్లు తస్కరించేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మెయిలే ఒకటి కె.మనోజ్ అనే అతనికి వచ్చింది. ఆర్ బీఐ బ్యాంకు ఖాతాదారుల భద్రత కోసం కొత్త విధానం ప్రారంభించడం భలే భేష్ అనుకున్నాడట. కొంచెం కూడా ఆలోచించకుండా తన బ్యాంకు ఖాతా వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పేశాడు. తర్వాత డబ్బులు అవసరమై డ్రా చేసుకుందామని చూస్తే 0 బ్యాలెన్స్ అని వచ్చింది. అప్పుడు కానీ తాను మోసపోయినట్లు మనోజ్ గుర్తించలేదు. సో తస్మాత్ జాగ్రత్త!