: రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, కేంద్రంలో వాజమ్మ ప్రభుత్వం ఉంది: జేపీ


ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరినొకరు నీచాతి నీచంగా తిట్టుకుంటున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా ఘోరమని అన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేయకుండా... ఫైళ్లపై సంతకాలు చేస్తూ దోచుకోవడానికి పనిచేస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, కేంద్రంలో వాజమ్మ ప్రభుత్వం ఉందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలంతా కలసి రాజ్యాంగాన్ని పాతిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర అనేవి కేవలం ప్రజలను దగా చేసేందుకే అని దుయ్యబట్టారు. ఈ రోజు జేపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని జేపీ అన్నారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగలేదని... మంత్రి వర్గం కూడా పనిచేయడం మానేసిందని మండిపడ్డారు. ఒక్క అంశంలో కూడా రాష్ట్ర మంత్రులు కలసి పనిచేయడం లేదని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయం నడుస్తోందని తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజల ఉన్నతి కోసం కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన వారు... రాజ్యాంగ ఖననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి ప్రయోజనాల కోసం ఢిల్లీపై దండెత్తుదామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News