: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులు
ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి వచ్చిన భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. భారత విద్యార్థి మనిరాజ్విందర్ సింగ్ పై జరిగిన దాడితో సంబంధమున్న ముఠాలోని 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ యువకుడు బెయిల్ కోరుతూ చిల్డ్రన్స్ కోర్టును ఆశ్రయించాడు. నిందితుడు ఉద్దేశ్య పూర్వకంగానే బాధితుడిపై దాడికి పాల్పడినట్టు న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ దగ్గరలోని ప్రిన్సెస్ వంతెన వద్ద ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరాజ్విందర్ సింగ్పై ఆదివారం ఎనిమిది మంది యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలో ఉన్నాడని, చికిత్స కొనసాగుతోందని అతడి సోదరుడు యద్వేంధర్ సింగ్ చెప్పాడు. అయితే, అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, కోలుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.