: గత 15 ఏళ్లలో జరిగిన కుంభకోణాలన్నీ వెలికి తీస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ తామిచ్చిన ఎన్నికల హామీలన్నీ ఆగమేఘాల మీద నెరవేరుస్తున్నారు. నెలకు 20 వేల లీటర్ల నీరు ఇంటింటికీ అందజేసే ఫైలుపై సంతకం చేసిన కేజ్రీవాల్, విద్యుత్ డిస్కంలపై కాగ్ ఆడిట్ కు ఆదేశించారు. ఇప్పడు అవినీతిపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. గత 15 ఏళ్లలో ఢిల్లీ ప్రభుత్వాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలపై దర్యాప్తు చేయించనున్నామని ఆయన ప్రకటించారు.
ఢిల్లీ ఆసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రాజకీయ నాయకులు అనుభవించే ప్రతి పైసా ప్రజలదేనని గుర్తించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా పేదల జీవితాల్లో వెలుగులు రావడం లేదని ఆయన అన్నారు.