: విభజన కోసం మరిన్ని రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి: ఉండవల్లి


తెలంగాణలా అసెంబ్లీతో సంబంధం లేకుండా విభజన జరగాలని అడిగేందుకు పలు రాష్ట్రాలు కాచుక్కూర్చున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ రెండు ప్రాంతాలకు రాజధాని కనుక దానిపై అందరికీ హక్కు ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. 'తెలంగాణ' పేరిట గతంలో ఎప్పుడూ రాష్ట్రం లేదని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ అనే రాజ్యం ఉండేదని భారత దేశం ఏర్పాటు తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా తెలుగు మాట్లాడేవారినందర్నీ కలిపి రాష్ట్రం చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగితే 140 మంది శాసన సభ్యుల్లో 102 మంది ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయాలన్నారనీ, వారి ఆమోదం మేరకే రాష్ట్రం ఏర్పాటైందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ సంస్థానాన్ని మూడు రాష్ట్రాల్లో కలిపారన్న విషయాన్ని వదిలేసి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కలిపారని అనడం అవాస్తవమన్నారు. వాస్తవాలు వక్రీకరించి కొందరు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రేపట్నుంచి జరిగే అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధి చెందలేదంటే దానిపై సమగ్రంగా చర్చిద్దామని ఆయన సూచించారు. తెలంగాణకు నీటి లభ్యత ఎంతనే విషయాన్ని కూడా చెప్పగలమని తెలిపారు. పార్లమెంటుకు వచ్చిన తరువాత ఎంపీల పని మొదలవుతుందని, అప్పుడు తాము తమ ప్రతాపం చూపిస్తామని అయన అన్నారు. మత హింస బిల్లు, మహిళా బిల్లు, తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారని తాను చదివానని, ఆ మూడు బిల్లులపై ఎన్డీయే ఏం సమాధానం చెబుతుందో తమతో పాటు ప్రజలు కూడా గమనిస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News