: కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. నిరాశ్రయులైన 500 కుటుంబాలు
తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక దుమ్ములపేటలో దాదాపు వందకు పైగా మత్స్యకారులకు చెందిన పూరిళ్లు బుధవారం రాత్రి అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో 500 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. అగ్నిప్రమాద సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. వెంటనే అదుపుకాకపోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది.
జిల్లా కలెక్టరుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులు పునరావాస ఏర్పాటు కల్పించాలని కలెక్టరును కోరారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.