: స్కైప్ అకౌంట్లు హ్యాక్
సోషల్ మీడియా స్కైప్ అకౌంట్లను సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యాక్ చేసింది. ఈ సంస్థ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ కు మద్దతుగా ఈ పని చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ అయిన స్కైప్ ద్వారా ఉచితంగా మాట్లాడుకునేందుకు, వీడియో కాల్, చాట్ కు అవకాశం ఉంటుంది. స్కైప్ అకౌంట్లను హ్యాక్ చేసిన సిరియన్ ఆర్మీ మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కాంటాక్ట్ సమాచారాన్ని అక్కడ పెట్టింది. 'మైక్రోసాఫ్ట్ ఈ మెయిల్(హాట్ మెయిల్), స్కైప్ వాడకండి. వారు మీ అకౌంట్లలోని సమాచారాన్ని పర్యవేక్షిస్తారు. ప్రభుత్వాలకు అమ్ముకుంటారు' అంటూ సైట్లో హ్యాకర్లు పేర్కొన్నారు. స్కైప్ కూడా అమెరికా జాతీయ భద్రతా సంస్థ నిఘా పరిధిలో ఉందంటూ ఎడ్వర్డ్ స్నోడెన్ లోగడే వెల్లడించాడు.