: 69 ఏళ్లపాటు ఎక్కిళ్లతో ఇక్కట్లు పడ్డాడు!


మనకు ఎప్పుడైనా ఎక్కిళ్లు వస్తే ఏం చేస్తాం... చక్కగా ఓ గ్లాసు నీళ్లు తాగుతాం. అక్కడికీ తగ్గకపోతే, వేరే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తాం. కానీ ఎన్ని చిట్కాలు చేసినా ఎక్కిళ్లు ఆగకుండా ఉంటే ఏం చేయాలి... ఇలా ఆగకుండా ఎక్కిళ్లతో ఒక వ్యక్తి సుమారు 69 ఏళ్లపాటు బాధపడ్డాడు. చివరికి ఎక్కిళ్లు ఆగాయి. కానీ ఆ ఆనందాన్ని అనుభవించకుండా అనంతలోకాలకు పయనమయ్యాడు.

ఛార్లెస్‌ ఓస్‌బోర్న్‌ అనే వ్యక్తి 1922లో ఒక బరువైన పందిని ఎత్తడంతో అతనికి ఎక్కిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ ఎక్కిళ్లు అప్పటినుండీ ఏకబిగిన ఆగకుండా విసిగించాయి. ఎంతకాలం అంటే 69 ఏళ్ల కాలం పాటు. ఈ ఎక్కిళ్లు మొదలైన కొన్ని దశాబ్దాల్లో అతనికి నిమిషానికి 40 ఎక్కిళ్లొచ్చేవట. తర్వాత ఆ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చి చివరికి నిమిషానికి 20 ఎక్కిళ్లకు తగ్గిందట. ఇలా నెమ్మదిగా తగ్గుతూ వచ్చి 1990 నాటికి ఎక్కిళ్లు ఆగిపోయాయి. అంటే అతని మొత్తం జీవితంలో సుమారు 4కోట్ల 30 లక్షల ఎక్కిళ్లు వచ్చాయన్నమాట. ఇన్నిసార్లు ఎక్కిళ్లు వచ్చినా ఛార్లెస్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు, చక్కగా ఎనిమిది మంది పిల్లల్ని కూడా కన్నాడు. ఇంతగా ఎక్కిళ్ల జీవితాన్ని అనుభవించిన ఛార్లెస్‌కు చివరికి ఎక్కిళ్లు ఆగిపోయాయి. అలా ఆగిపోయిన తర్వాత 11 నెలలకు ఎక్కిళ్లు లేని ఆనందమయమైన జీవితాన్ని అనుభవించేలోగా ఛార్లెస్‌ మరణించాడు.

  • Loading...

More Telugu News