: అక్కడ ‘చావు’లోకూడా ప్రేమే కనిపిస్తోంది!
బతికినంతకాలం ఆనందంగా బతుకుతాం. చనిపోయేటప్పుడు ఎవరు ఎప్పుడో ఎవరికీ తెలియదు. కానీ ఒకరు చనిపోయిన తర్వాత వారిని మరిచిపోయి తమ తర్వాత జీవితాన్ని గడపలేక తనవారితోబాటు తనువు చాలించేవారు ఉంటారా... కానీ అక్కడ లభించిన కొన్ని అస్థిపంజరాలను చూస్తే మాత్రం అలాంటి వారు అప్పట్లో ఉండేవారేమో అనిపిస్తుంది.
రష్యాలోని నొవాస్‌బిరిస్క్ ప్రాంతంలోని స్టార్యీ టార్టాస్ గ్రామంలో పదుల సంఖ్యలో మానవ అస్థిపంజరాలను శాస్త్రవేత్తలు తవ్వకాల్లో గుర్తించారు. వీరిలో చాలా వరకూ జంట అస్థిపంజరాలు కాగా మరికొన్ని జంటలతోబాటు వారి పిల్లలకు సంబంధించిన అస్థిపంజరాలు కూడా ఉన్నాయట. ఇక్కడ లభించిన అస్థిపంజరాలు సుమారు 3,500 ఏళ్లనాటి అస్థిపంజరాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ఒక జంట అస్థిపంజరాలు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసిన స్థితిలో ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు అక్కడ లభించిన చాలా వరకూ అస్థిపంజరాలు ఒకరినొకరు పట్టుకుని వున్న స్థితిలో ఉన్నవే కావడం గమనార్హం. అలాగే కొన్ని అస్థిపంజరాల్లో భార్యాభర్తలిద్దరూ బిడ్డల్ని పట్టుకుని చనిపోయిన స్థితిలో కూడా లభ్యమయ్యాయని ద సైబీరియన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మొత్తానికి అక్కడి అస్థిపంజరాలను చూస్తే చావులో కూడా మనం విడిపోకూడదు అనుకున్నట్టుగా ఉందనిపిస్తుంది కదూ!