: కేజ్రీవాల్ పై గోవా సీఎం ప్రశంసలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో వీరిద్దరూ ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదివారు. ఆశ్చర్యకరంగా ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. దాంతో, తమ కళాశాలలోనే చదివిన కేజ్రీవాల్ ను పారిక్కర్ పొగడటం విశేషం. ఉన్నత విద్యావేత్తగా రుజువు చేసుకున్న కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సముచితమైన వాగ్దానాలు చేశారని గోవా సీఎం అన్నారు. ఇప్పుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన వాటిని ఎలా నెరవేరుస్తారో మాత్రం చూడాలన్నారు. తాను, కేజ్రీవాల్ ఖరగ్ పూర్ ఐఐటీలో ఒకేసారి డిగ్రీ తీసుకున్నట్లు పనాజీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. కళాశాలలో తాను మెటలర్జీ ఇంజినీరింగ్ చదివానన్నారు. అక్కడ చదివిన వారిలో తాను మొదటి ముఖ్యమంత్రి అయితే, అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, ఢిల్లీ సీఎం అయ్యారని పేర్కొన్నారు.