: వెస్టిండీస్ పై న్యూజీలాండ్ ఘన విజయం


వెస్టిండీస్, న్యూజీలాండ్ ల మధ్య క్వీన్స్ టౌన్ లో జరిగిన మూడో వన్డేలో 159 పరుగుల తేడాతో విండీస్ చిత్తయింది. కివీస్ బ్యాట్స్ మెన్ కోరే అండర్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 47 బంతుల్లో 131 (14 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేశాడు. దీనికి తోడు, ఓపెనర్ రైడర్ 51 బంతుల్లో 104 (5 సిక్సర్లు, 12 ఫోర్లు) పరుగులతో విరుచుకు పడటంతో... కివీస్ 21 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకుముందు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటను 21 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో అండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మరో విశేషమేంటంటే, అండర్సన్ కు ఇదే తొలి వన్డే సెంచరీ.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్... 21 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెస్టెన్ డ్వేన్ బ్రావో మాత్రమే 56 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు. దీంతో కివీస్ కొత్త సంవత్సరం ఆరంభాన్ని 159 పరుగుల భారీ విజయంతో ప్రారంభించినట్టయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అండర్సన్ ఎంపికయ్యాడు. దీంతో 5 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మరో రెండు మ్యచ్ లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News