: కొత్త సంవత్సరం ఊపు వారమేనట
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం... ఈరోజు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేస్తాం. అలాగే పనిలో పనిగా ఈరోజు కొత్తగా కొన్ని నిర్ణయాలను తీసేసుకుంటాం. వాటిని చక్కగా కొత్త డైరీలో రాసేసుకుంటాం. వాటిని ఎలాగైనా పాటించాలనుకుంటాం... కానీ ఈ ఊపు కేవలం రెండు వారాల పాటు మాత్రమే ఉంటుందట.
కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలను తీసుకుని వాటిని ఎలాగైనా పాటించాలని చాలామంది అనుకుంటారట. కానీ ఈ పట్టుదల కనీసం జనవరి పూర్తయ్యేదాకా కూడా ఉండదట. వారం రోజుల తర్వాత తాము తీసుకున్న నిర్ణయాలను గురించి మరచిపోతారని పరిశోధకుల అంచనా. కొత్త సంవత్సరంలో బరువు ఎక్కువగా ఉండేవారయితే ఈ ఏడాది బరువు తగ్గుతాను, రోజూ వాకింగ్‌కి వెళతాను అనో, దమ్ముకొట్టడం, మద్యం అలవాటుండేవారు ఈ ఏడాది మద్యం ముట్టను, సిగరెట్ మానేస్తాను అనో, అలాగే డబ్బు దుబారా ఎక్కువగా చేసేవారు ఈ ఏడాది డబ్బులు జాగ్రత్తగా ఖర్చుపెడతాను అనో ఇలా జనవరి 1వ తారీఖున నిర్ణయాలను తీసుకుంటారు.
వాటిని కొత్త డైరీలో రాసుకుంటారు కూడా. కానీ జనవరి రెండవ వారానికల్లా ఇలాంటివారు చాలా వరకూ తాము తీసుకున్న నిర్ణయాలను మరచిపోవడం, లేదా వాటిని పాటించలేకపోవడం వల్ల మళ్లీ పాత పద్థతిలోనే వెళ్లిపోతారని పరిశోధకుల అంచనా. మరి మీరేమని నిర్ణయం తీసుకున్నా... అది మంచి నిర్ణయమే, అయితే దానికి కట్టుబడి ఉండేదానికి ప్రయత్నించండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.