: ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో ఉన్నాం.. మీలా అవినీతికి పాల్పడలేదు: సోమిరెడ్డి
టీడీపీలో నేతలంతా ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లో కొనసాగుతున్నామని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తాము అవినీతికి పాల్పడుతూ రాజకీయాల్లో లేమని, విలువలకు కట్టుబడి రాజకీయాల్లో కొనసాగుతున్నామని అన్నారు. చంద్రబాబును అవినీతిపరుడు అంటూ వ్యాఖ్యానించిన జగన్ పై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడి ఆస్తులపై అనవసర రాద్దాంతం చేస్తున్న జగన్, బొత్సలు నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.
ఇడుపులపాయలో జగన్ కట్టిన గెస్ట్ హౌస్, పులివెందులలో జగన్ కు ఉన్న నివాసం, కడపలో జగన్ ఇల్లు, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులో ప్యాలెస్ అన్నీ మీడియాకు కానీ, న్యాయస్థానాలకు కానీ చూపిస్తే... చంద్రబాబుకు సంబంధించిన ఏ ఆస్తి అడిగినా చూపించేందుకు తాము సిద్ధమని సోమిరెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబుపై జగన్, లక్ష్మీపార్వతి, కన్నా లక్ష్మీనారాయణ అందరూ కేసులెయ్యలేదా? అని ప్రశ్నించారు.
చివరకు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఉపసంఘం విచారణ అన్నారు. ఏవైనా అక్రమాస్తులు గుర్తించారా? అని ఆయన ప్రశ్నించారు. భువనేశ్వరి, లోకేష్ లు వ్యాపారం నీతిగా చేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్, బొత్సలా తాము అబద్ధాలు చెప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. బినామీ కంపెనీల్లో వ్యాపారం చేసుకునే బొత్స, అవినీతికి పాల్పడ్డ జగన్ లు చంద్రబాబునాయుడి నీతిని ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. ఏ కేసులో అవినీతి చేశాడని రుజువు చేసి, అవినీతిపరుడంటున్నారని సోమిరెడ్డి నిలదీశారు.