: కొత్త పోప్ గా ఎన్నికైన మారియో బెర్గోగ్లియో
ఉత్కంఠ వీడింది ... ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోని 120 కోట్ల మందితో కూడిన శక్తిమంతమైన చర్చికి నేతృత్వం వహించే కొత్త పోప్ ఎన్నిక విజయవంతంగా ముగిసింది. 266వ పోప్ గా అర్జెంటీనా దేశానికి చెందిన కార్డినల్ జార్జి మారియో బెర్గోగ్లియో ఎన్నికయ్యారు. ఇందుకు సంకేతంగా ... ఈ ఎన్నికను నిర్వహించిన ప్రసిద్ధ సిస్టీన్ చాపెల్ భవనం చిమ్నీ బుధవారం రాత్రి తెల్లని పొగను విరజిమ్మింది.
దీంతో వాటికన్ సిటీలో ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకను కనులారా వీక్షించడానికి సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో గుమికూడిన జనం హర్షాతిరేకంతో గంటలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచీ విచ్చేసిన 115 మంది కార్డినల్స్ పలువిడతలుగా చర్చలు జరిపి, చివరికి పోప్ ఎన్నికను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ ఎన్నికలలో పాల్గొన్న కార్డినల్స్ లో ఐదుగురు భారతీయులు కూడా వుండడం విశేషం!