: తాతకు తగ్గ మనవడు కేజ్రీవాల్!
అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. సాధారణ ప్రజానీకానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా కలవొచ్చని చేతల్లో చూపించిన వ్యక్తి. రాజకీయనేతలకు ఆదర్శంగా తనకు భారీ కాన్వాయ్ అవసరం లేదని, నామమాత్రపు సెక్యూరిటీ మాత్రమే చాలని చేతల్లో చూపిస్తున్న వ్యక్తి. తాను సేవ కొసమే రాజకీయాల్లోకి వచ్చానని, దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టడమే తనముందున్న లక్ష్యమని చాటుతున్న వ్యక్తి.
తాజాగా ఢిల్లీలో నెలకు ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీటిసరఫరా అమలు ఫైలుపై సంతకం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షం వెల్లువెత్తుతుండగా, హర్యానాలోని అతని స్వగ్రామంలో మాత్రం అతను తన తాతలక్షణాలతో పుట్టాడని అందుకే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడని అంటున్నారు.
కేజ్రీవాల్ తాత మంగళ్ చంద్ కూడా తన గ్రామంలో మంచినీటికి కటకటలాడుతుండడం చూసి చలించిపోయి స్వంత ఖర్చులతో బావి తవ్వించాడు. దాని నుంచి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా మంచినీరు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా మంచినీటి ఫైలుపై సంతకం చేయడంతో అతనికి అన్నీ తాతపోలికలేనని గ్రామస్థులు మురిసిపోతున్నారు.