: చాక్లెట్ ప్రింటర్ వచ్చేసిందోచ్
మనకు కావాల్సిన ఆకారాల్లో చక్కటి చాక్లెట్లను మనం ప్రింట్ చేసుకుని, చకచకా చప్పరించేయవచ్చు. ఎలాంటి ఆకారాలనైనా... ఎలాగంటే మీ ముఖం లాంటి ఆకారంలో కూడా చాక్లెట్‌ను ప్రింట్ తీసుకుని దాన్ని చక్కగా చప్పరించేయవచ్చు. అలాంటి కొత్తరకం ప్రింటర్‌ను పరిశోధకులు తయారుచేశారు. అంతేకాదు... ప్రపంచంలో తొలి త్రీడీ చాక్లెట్ ప్రింటర్ కూడా ఇదేనని సగర్వంగా చెబుతున్నారు.
చాక్ ఎడ్జ్ కంపెనీ ఒక కొత్తరకం త్రీడీ ప్రింటర్‌ను రూపొందించింది. ఈ ప్రింటర్‌లో మీ ముఖం లాంటి ఆకారంలో చాక్లెట్‌ను ప్రింట్ చేసుకుని చక్కగా మీరే తినేయవచ్చట. ఇలాంటి తరహాలో ప్రింట్ చేసే తొలి ప్రింటర్ ఇదేనని సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య పరిశోధకుడు లియాంగ్ హో చెబుతున్నారు.
ఈ ప్రింటర్ ప్రింటింగ్ హెడ్‌లో కావాల్సిన చాక్లెట్‌ను వినియోగించుకోవచ్చని, దీనిలో 15 నుండి 30 నిమిషాల దాకా ఆగకుండా ప్రింటింగ్ కొనసాగుతుందని లియాంగ్ చెబుతున్నారు. ఈ ప్రింటర్ ద్వారా 0.5 ఎంఎం నుండి 1.5 ఎంఎం మందంతో చాక్లెట్ ఆకృతులు ప్రింట్ అవుతాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు, కేవలం ముఖాలనే కాకుండా ఇతర ఆకృతులను కూడా చాక్లెట్ ప్రతిరూపాలను ఈ ప్రింటర్ ద్వారా ముద్రించుకోవచ్చని లియాంగ్ చెబుతున్నారు.