: తెలుగు జాతికి అన్యాయం చేస్తే... ఖబడ్దార్!: బాబు


'తెలుగు జాతికి అన్యాయం చేస్తే... సోనియా గాంధీ ఖబడ్దార్' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 'తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రులకు ఆమోద యోగ్యం కావాలి. అలాగే సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోవాల'ని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లోనూ గల్లంతైపోయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కనబడడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని బాబు ఎద్దేవా చేశారు.

'ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నాడా? నిజంగానే పోరాడుతున్నాడా? అంటూ అనుమానం కలుగుతోందని' ఆయన సీఎంపై అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ, ఏ ప్రాంతానికీ నష్టం జరగడానికి వీల్లేదని.. ఒకవేళ ఏదైనా జరిగితే అది అందరి ఆమోదంతోనే జరగాలని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగు జాతిని బాధ పెట్టిన ఎవరూ చరిత్రలో మిగల్లేదని ఆయన గుర్తు చేశారు.

సుపరిపాలన, అవినీతి వ్యతిరేకంగా పని చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అనాధగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేసే బాధ్యత టీడీపీదేనని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్న బాబు, 'జాబు కావాలంటే బాబు రావాలి' అన్న యువత నినాదం నిజమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు వెయ్యి నుంచి 2 వేలు జీవన భృతి ఇచ్చి ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. వితంతువులకు ఫించన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కూలీలకు లోటు రాకుండా పనికి ఆహారం పధకాన్ని ఎక్కువ రోజులకు పెంచుతామన్నారు. నిరుపేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత టీడీపీదేనని ఆయన తెలిపారు. ఆడపిల్లలకు భద్రతనిస్తామని, వారి రక్షణకు అవసరమైతే ప్రత్యేక చర్యలు, చట్టాలు తీసుకొస్తామని బాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News