: నువ్వేమన్నా నీతి పరుడివా? నీ సంగతి అందరికీ తెలుసు: బాబుపై బొత్స ఫైర్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు సంపాదించాడని రాష్ట్రం మొత్తం కోడైకూస్తోందని, అంత సంపాదన ఏ నీతిమంతమైన పనులు చేసి సంపాదించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఘనత ఏంటంటే ఆయనపై వేసిన విచారణలను వాయిదాలు వేయించుకోవడమేనని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. అందుకోసమే రాహుల్ గాంధీ లోక్ పాల్ బిల్లును ముందుకు తెచ్చారని అన్నారు. రాష్ట్రాల్లో కూడా వీలైనంత తొందరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

చిత్తురు జిల్లా నుంచి వచ్చానని, ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకోవడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏదో త్యాగపురుషుడిలా మాట్లాడటం మాత్రం సరికాదని బొత్స హితవు పలికారు. నీతికి తానే మారుపేరులాగా, అవినీతి అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతుంటే వింతగా ఉందన్నారు. చంద్రబాబు దృష్టిలో రాష్ట్ర ప్రజలు అమాయకుల్లా, తెలివిలేని వారిలా, తెలిసినా చేతకాని వారిలా కనిపిస్తున్నట్టు ఉందని మండిపడ్డారు. చంద్రబాబు వేసే వేషాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బొత్స స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News