: ఆ నలుగురు చంద్రబాబుపై కుట్ర పన్నారు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగడం లేదని... దీనికి కారణం టీఆర్ఎస్సేనని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోవడం వల్లే ప్రక్రియ ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తామే కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారని అన్నారు. తప్పు వారి దగ్గర పెట్టుకుని... చంద్రబాబు మీద విమర్శలు చేయడం టీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ రోజు ఆయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
పచ్చి సమైక్యవాది కావూరిని సిరిసిల్లలో కేటీఆర్ కౌగిలించుకోవడం నిజం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. సీఎం కిరణ్ కు కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం హరీష్ రావు, టీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్, హరీష్, కేటీఆర్ లు అందరూ చంద్రబాబుపై కుట్రపన్నారని మండిపడ్డారు. వీరందరూ కూర్చొని తమ నేత చంద్రబాబు సమైక్యవాదా? కాదా? అనే విషయాన్ని తేల్చగలరా? అని ప్రశ్నించారు.
జనవరి కల్లా తెలంగాణ ఏర్పడుతుందన్న కాంగ్రెస్ వారు ఇప్పుడెక్కడకు వెళ్లారని రేవంత్ ప్రశ్నించారు. చర్చల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వాయిదా వేసుకుంటూ పోతోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అనుకూలమంటే... సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమని చెప్పినట్టు కాదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలను ఆదుకునేది టీడీపీనే అని చెప్పారు.