: అద్దెకున్న వారే దోచేశారు!


అద్దెకున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని... గోదావరిఖనిలో ఓ ఘటన మరోసారి నిరూపించింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని కల్యాణ్ నగర్ లో ఎఫ్ సీఐ క్రాస్ రోడ్డులో నగునూరి వెంకటేశం, అంజలి దంపతులు వారి ఇంటి కింద పోర్షన్ లో కిరాణా షాప్ నిర్వహిస్తూ, పైఅంతస్తును ఓ దంపతులకు అద్దెకి ఇచ్చారు. వారు తొమ్మిదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. దీంతో వారిని వెంకటేశం దంపతులు పూర్తిగా నమ్మారు. రెండేళ్లక్రితం వారి కిరాణా షాప్ తాళంచెవులు పోయాయి.

దీంతో మారు తాళం చెవులతో వెంకటేశం దుకాణం తెరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంట్లోని, కిరణాషాపులోని వస్తువులు, బంగారం మాయమవ్వడం ప్రారంభం అయింది. దీంతో తన భార్యపై అనుమానం పెరిగింది. వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. చివరకు తన స్నేహితుడి సలహామేరకు షాపులో, ఇంట్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 25న కరీంనగర్ లోని బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లారు.

అట్నుంచి వచ్చి చూసేసరికి ఇంట్లోని నగదు, బంగారం, కిరాణా షాపులోని వస్తువులతో పాటు, అద్దెకున్న దంపతులు కనిపించకుండాపోయారు. దీంతో వెంకటేశం సీసీ కెమేరా పుటేజీలను పరిశీలించాడు. అసలు దొంగలు దొరికారు. అద్దెకున్నవారే తాళాలతో షాపు, ఇళ్లు తెరిచి చోరీకి పాల్పడ్డట్టు నిర్ధారించుకుని డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇందులో కొసమెరుపేంటంటే, నిందితుడికి అధికారపార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి... దీంతో వారు రాజీ కుదర్చాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News