: సైకిలెక్కనున్న కాపు సామాజిక వర్గ బలమైన నాయకుడు?
కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగిన ముద్రగడ పద్మనాభం గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయ పునరాగమనం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తనకు మంత్రిగా, ఎంపీగా అవకాశమిచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరడానికే ఆయన మొగ్గుచూపుతున్నట్టు... అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన గత కొన్ని రోజులుగా జిల్లా టీడీపీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
గతంలో ముద్రగడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అంతే కాకుండా కొద్ది కాలం క్రితం పీసీసీ చీఫ్ బొత్స ముద్రగడ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కానీ, ముద్రగడ సైకిలెక్కడానికే సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఆయన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో పలుమార్లు భేటీ అయ్యారని తెలుస్తోంది. రానున్న 2014 ఎన్నికల్లో ముద్రగడకు తెలుగుదేశం పార్టీ పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే టీడీపీకి మళ్లీ కాపు ఓటు బ్యాంక్ దగ్గరయినట్టేనని విశ్లేషకుల అంచనా.