: చదువు మెదడుపై ప్రభావం చూపుతుందట
మనం ఎలాంటి విషయాలను చదివినా అవి మన మస్తిష్కంపై ప్రభావం చూపుతాయట. మనం ఎలాంటి పుస్తకాన్ని చదివినా దానికి సంబంధించిన ప్రభావం మన మెదడుపై కొన్ని రోజుల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎమోరి విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోని 21 మంది విద్యార్ధులపై 19 రోజులు వరుసగా ఒక పరిశోధన నిర్వహించారు. వారికి రాబర్ట్ హారిస్ రచించిన ‘పొంపెలీ’ అనే థ్రిల్లర్ నవలను ఇచ్చి చదవమన్నారు.
ఈ ప్రయోగంలో తొలి ఐదురోజులు ఈ విద్యార్ధులకు ఉదయమే ఎమ్మారై స్కానింగ్ నిర్వహించి మెదడు స్థితిగతులను నమోదుచేశారు. తర్వాత వారిని నవలలోని తొమ్మిది భాగాలను తొమ్మిది రోజులపాటు చదవమని సూచించి ఏ రోజుకారోజు చదవడం పూర్తయ్యాక వారి మెదడును స్కానింగ్ జరిపారు. గడువు పూర్తయిన తర్వాత మరో ఐదురోజుల వరకూ ఎమ్మారై స్కానింగ్ చేశారు.
ఈ పరిశోధనలో బాహ్య గ్రాహ్యతలకు మెదడును అనుసంధానం చేసే ఎడమ టెంపోరల్ కణజాలం సంధాన సామర్ధ్యం పుస్తక పఠనం చేసిన రోజుల్లో పెరుగుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాన్ని గడువు పూర్తయిన తర్వాత జరిపిన స్కానింగ్‌లో కూడా గుర్తించామని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన నాడీశాస్త్రవేత్త గ్రెగరీ బెర్న్ చెబుతున్నారు. దీన్ని షాడో యాక్టివిటీ అంటామని, ఈ సంధాన సామర్ధ్య వృద్ధిని శరీర సంవేదనకు కారణమయ్యే నాడీకణాలుండే మెదడు కేంద్రీయ గాడుల ప్రాంతంలోనూ కనుగొన్నట్టు బెర్న్ వివరించారు.