: రెప్పపాటులో ఆపరేషను!
ఒక ఆపరేషను అంటే చాలా తతంగం ఉంటుంది. అసలు దానికి పరికరాలను సమకూర్చుకోవడానికే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఒక్క క్షణంలో ఆపరేషను అంటే ఎలా సాధ్యం... అనుకుంటున్నారా... ఆపరేషను అంటే చిన్నపాటిది మాత్రమే. సాధారణంగా కేన్సర్, వంటి కొన్ని రకాల వ్యాధులను గుర్తించేందుకు వైద్యులు రోగుల శరీరంలో కొంతమేర కణజాలాన్ని సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. దీన్ని బయాప్సీగా చెబుతారు. ఈ బయాప్సీకి కేవలం ఒక్క క్షణం మాత్రమే చాలంటే... ఆశ్చర్యం వేస్తుంది. కానీ శాస్త్రవేత్తలు ఇలా ఒక్క క్షణంలో కణంలోని కొంత భాగాన్ని సేకరించగలిగే ఒక కొత్తరకం పిప్పెట్ (గాజు నాళిక)ను తయారుచేశారు. ఈ నాళిక ద్వారా కేవలం ఒక క్షణంలోనే కణంలో కొంత భాగాన్ని సేకరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక నానో పిప్పెట్‌ను తయారుచేశారు. ఈ నానో పిప్పెట్‌తో కేవలం ఒక్క క్షణంలో ఒక్క కణం నుండి మాత్రమే అది కూడా కణాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండానే కొంతమేర పదార్ధాన్ని సేకరించవచ్చని చెబుతున్నారు. ఈ నానో పరీక్ష నాళికతో సజీవ కణంలోనే యాభై ఫెల్టోమీటర్ల పదార్ధాన్ని అంటే ఒక కణంలో ఒక శాతం భాగాన్ని సేకరించవచ్చని ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ పావోలో యాక్టిస్ తెలిపారు. ఈ నాళిక సాయంతో కణస్థాయిలోని లోపాలను, వ్యాధులను చక్కగా గుర్తించవచ్చని, అవసరమైతే నేరుగా ఒక్కో కణంలోకి ఔషధాలను కూడా చొప్పిస్తూ వాటికి శస్త్రచికిత్స చేయవచ్చని పావోలో చెబుతున్నారు.