: అవినీతిమయ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటా?: బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా
అవినీతిమయమైన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా దూషించి, ఎన్నికల బరిలోకి దిగిన కేజ్రీవాల్, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వానికీ ఐదేళ్ల పాటు మద్దతు ఇవ్వలేదని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తన మద్దతును వీలైనంత తక్కువ కాలంలోనే ఉపసంహరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అవినీతిని రూపుమాపుతామని చెప్పిన కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడంలో అర్థం లేదన్నారు. ఏఏపీకి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించినా, తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు.