: మేడం ... ఇవి తింటున్నారా?
ఉద్యోగం చేసే మగువలు తమ రోజువారీ జీవితంలో వివిధ రకాల బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు పిల్లలకు తల్లిగాను, భర్తకు భార్యగాను ఇంట్లో ఇతర పనులన్నింటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు తమ ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపరు. దీంతో పలు రకాలైన అనారోగ్య సమస్యలతో వారు సతమతమవుతుంటారు. అందుకే ఉద్యోగం చేసే మహిళలు తమ ఆహారంలో ఇలాంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగం చేసే మహిళలకు ఎముకలు బలంగా ఉండాలి. ఇలాంటి వారికి రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం. ఇందుకోసం శరీరంలో కాల్షియం ఉత్పత్తులు పెరగడానికి తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తీసుకోవాలి. అలాగే తాజా ఆకుకూరలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అలాగే నెలసరి సమస్యవల్ల శరీరానికి ఐరన్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఆహారంలో బీన్స్, రాగులు, కర్జూరం, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. రోజుకు కనీసం 12 నుండి 15 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి. శరీరానికి తగిన శక్తి కోసం విటమిన్ సి ని తీసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు పనిచేసే ఉద్యోగినులు వీలైనప్పుడల్లా ఏదో ఒక పండు తినాలి. టమోటా, నిమ్మ, బంగాళాదుంపలతోబాటు జామపండ్లు, నారింజ, బత్తాయి ఇలా ఏదో ఒక పండు తినాలి. వీటిలో విటమిన్ సితోబాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలా కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వల్ల ఉద్యోగినులు ఆరోగ్యంగా ఉంటూ, చక్కగా చురుగ్గా తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు.