: మనుషులు కారా? మానవత్వం లేదా?: ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సినీ హీరో శివాజీ


'మీరు మనుషులు కారా?.. మీకు మానవత్వం లేదా?.. అసలేం జరుగుతోంది?.. ఎవరికి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు? ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే.. వారికి కనీస న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా' అని ప్రముఖ సినీ హీరో శివాజీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలెం బస్సు దుర్ఘటన బాధితులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో శివాజీ పాల్గొని తన మద్దతు తెలిపారు. 'మీరు కేటాయించిన కాంట్రాక్టులు, మీరు ఇచ్చిన అనుమతులే రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీస్తుంటే చేష్టలుడిగి ఎలా కూర్చుంటున్నారు?.. ప్రతి అనుమతికి, ప్రతి కాంట్రాక్టుకి 20 శాతం నిధులు లంచంగా మీ జేబుల్లోకి రావడం లేదా? మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి?'అని ఆయన గట్టిగా నిలదీశారు.

కొంత మంది ప్రజలు మాంసం ముద్దలుగా మారిపోతే.. ఆ ఘటన చూసిన వాడి గుండె మండుతోందన్నారు. అలాంటిది రెండు నెలలుగా వీరు రోడ్డెక్కి న్యాయం చేయండని అడుగుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శివాజీ మండిపడ్డారు. మీకు చేతనైతే ప్రైవేటు ట్రావెల్ వ్యవస్థని రద్దు చేయండి అని ఆయన పాలకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఈ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చానని.. తనలాగే వందలాది మంది బాధితులకు బాసటగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. చివరిగా 'సీఎం కిరణ్ గారూ, మీరు తలచుకుంటే ఇది సరిదిద్దలేని సమస్య కాదు.. దయచేసి కల్పించుకోవాలని' శివాజీ కోరారు.

  • Loading...

More Telugu News