: జగన్ అవినీతి రాహుల్ గాంధీకి కనిపించలేదా?: చంద్రబాబు
యూపీఏ పాలనలో అన్నీ కుంభకోణాలేనని, ప్రతి కుంభకోణంలోనూ కాంగ్రెస్ వాళ్ల పాత్ర ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. హైదరాబాదులో ఈరోజు సాయంత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూడా అవినీతి రాజ్యమేలుతోందని బాబు అన్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మైనింగ్ కుంభకోణం జరిగిందని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని చంద్ర బాబు చెప్పారు. జగన్ అవినీతి రాహుల్ కు కనిపించలేదా?.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారి ఆస్తులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ కు చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
అన్నా హజారే ఉద్యమించినప్పుడైనా అవినీతి ప్రక్షాళన చేయలేదన్న చంద్రబాబు.. అవినీతిపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఢిల్లీలో కొత్త పార్టీ చేతిలో అధికార కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఇప్పటికీ తెప్పించలేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతేనంటూ ఆయన ఉదహరించారు.