: పవర్ స్టార్ 'వెడ్డింగ్ లైఫ్' కథ
పవన్ కల్యాణ్... తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగు లేని నటుడు. చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి... అనంతరం పవర్ స్టార్ గా ఎదగడం వెనుక ఎంతో కృషి, ఎంతో పట్టుదల, మరెంతో ఇండివిజ్యువాలిటీ ఉన్నాయి. టాప్ హీరో గా ఎదిగే క్రమంలో పవన్ ప్రతి చర్యా 'టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ' అయింది. తెరపై కనిపించే పవన్ కు, తెరవెనుక కనిపించే పవన్ కు ఎంతో తేడా ఉంటుందనేది... పవన్ కు సన్నిహితులైన వారు చెప్పే మాట. తెరపై ఎంతో జోవియల్ గా కనిపించే పవన్ కల్యాణ్ .. నిజజీవితంలో ఏకాంతాన్ని ఇష్టపడతాడు. తనదైన లోకంలో విహరించడానికే మక్కువ చూపుతాడు. ఈ క్రమంలో తన జీవిత భాగస్వాములకు కూడా సరైన సమయాన్ని కేటాయించలేకపోయాడనే వార్తలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో రెండో భార్యకు దూరమైన పవన్, సైలెంట్ గా ముచ్చటగా మూడోసారి పెళ్లిచేసుకున్నాడు. పవర్ స్టార్ వెడ్డింగ్ లైఫ్ కథేంటో ఓ సారి చూద్దామా...
తీన్ మార్ సినిమాలో రష్యా మోడల్ అన్నా లెజెనోవా పవన్ తో కలిసి పనిచేసింది. ఈ పరిచయం ప్రేమ వరకు వెళ్లి చివరకు పెళ్లితో ముగిసింది. ఇది పవన్ కు మూడో పెళ్లి. పవన్ మొదటి వివాహం విశాఖపట్నం కు చెందిన నందినితో జరిగింది. విశాఖలో సత్యానంద్ దగ్గర యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు... పవన్ కు నందిని పరిచయమైంది. అలా మొదలైన వారి పరిచయం... పెళ్లి వరకు వెళ్లి చివరకు పెటాకులైంది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. వీరిద్దరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
అనంతరం బద్రి సినిమాలో నటించిన రేణూ దేశాయ్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు పవర్ స్టార్. వీరిద్దరికీ పెళ్లికాకుండానే అకీరా అనే కుమారుడు కూడా పుట్టాడు. అనంతరం కొడుకు సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంసారం కొన్నాళ్లు సజావుగా సాగిన తర్వాత... ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు.
తర్వాత వరుస సినిమాలతో పవన్ బిజీ అయ్యాడు. తీన్ మార్ సినిమా సమయంలో పవన్ మళ్లీ ప్రేమలో పడ్డారు. అన్నా లెజెనోవా అనే విదేశీ నటి, రష్యన్ మోడల్ ని ప్రేమించి చివరకు పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరిద్దరికీ ఇప్పటికే ఓ పాప ఉన్నట్టు సమాచారం. వీరి పెళ్లికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక వదంతులు వస్తున్నా... నిజమో, కాదో అనే సందేహం అందర్లో నెలకొంది. ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ... ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ వివాహం జరిగిందని స్పష్టం చేశారు.