: అధికారం కోసం రాలేదు.. పని చేసేందుకు వచ్చాం: కేజ్రీవాల్
తాము రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదని, పని చేసేందుకు వచ్చామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలిపారు. సత్యాన్ని మించిన సాధనం మరొకటి లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రజలంతా తమకు ఓ పెద్ద బాధ్యత అప్పగించారని, వారి నమ్మకాన్ని అందుకోవడానికి పని చేస్తామని అన్నారు. తమకు కూడా వారి నమ్మకాన్ని అందుకోగలమా? లేదా? అనే భయం వేస్తోందని అన్నారు.
తెలిసో, తెలియకో తప్పులు చేసే మనస్థత్వాన్ని తమకు ఇవ్వవద్దని భగవంతుడిని కోరుతున్నానని అన్నారు. రాజకీయాల కోసం కానీ, వ్యక్తి గతం కోసం కానీ కాకుండా... దేశం కోసం పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
తనను చాలా మంది విశ్వాసపరీక్ష గురించి ఆడుగుతున్నారని, అయితే, విశ్వాసం వీగిపోతుందా? లేక విశ్వాసం గెలుస్తుందా? అనేది తనకు పెద్ద విషయం కాదని అన్నారు. సత్తా చూపించేందుకు తాము రాలేదని, పని చేసేందుకు తామంతా ఉద్యోగాలు వదులుకుని వచ్చామని అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశం బాగుపడుతుంది. మన జీవితంలో లంచం ఇవ్వవద్దు. లంచం తీసుకోవద్దు అని ఆయన ప్రజలతో శపథం చేయించారు.