: అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి
ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు రూపొందిస్తున్న సంప్రదాయం బాలీవుడ్ లో మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చినవే డర్టీ పిక్చర్, భాగ్ మిల్కా భాగ్, పాన్ సింగ్ తోమార్ చిత్రాలు. తాజాగా, క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 'ముద్దుల వీరుడు' ఇమ్రాన్ హష్మీను అజార్ పాత్రకు ఎంపిక చేశారు. దీనిపై స్పందించిన హష్మీ.. క్రీడలంటే బాగా ఇష్టపడే తనకు అజ్జు పాత్ర దక్కడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ముందు ఈ పాత్రకు అజయ్ దేవగణ్ పేరును కూడా పరిశీలించారట. క్రికెటర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎదిగిన అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, భార్య సంగీతా బిజలానీతో విడాకులు, ఓ ప్రమాదంలో కుమారుడిని కోల్పోవడం వంటి సంఘటనల సమాహారంగా చిత్రం తెరకెక్కుతుంది. కాగా, నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.