: రేపటినుంచి భారత్-ఆసీస్ మూడో టెస్టు


నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు రేపటి నుంచి మొహాలీలో జరగనుంది. వరుసగా రెండు టెస్టులు నెగ్గి టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తుండగా.. నలుగురు ఆటగాళ్లపై వేటు వేసిన ఆసీస్ బలహీనంగా కనిపిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ.. వైస్ కెప్టెన్ వాట్సన్, పేసర్లు ప్యాటిన్సన్, జాన్సన్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ఖవాజాలను మూడో టెస్టుకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

కాగా, 2-0తో సిరీస్ లో ఆధిక్యంలో ఉన్న భారత్..  మొహాలీలో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని తలపోస్తోంది. ఇక్కడా స్పిన్ పిచ్ తప్పదన్న నేపథ్యంలో భారత్ తొలి రెండు టెస్టుల్లో ఆడిన జట్టునే బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్విన్ కు తోడు జడేజా స్పిన్ లో రాణిస్తుండగా హర్భజన్ ప్రదర్శన కాస్త నిరాశకు గురిచేస్తోంది.

తుది జట్టులో చోటు దక్కితే భజ్జీ సొంతగడ్డపై చెలరేగే అవకాశాలున్నాయి. ఇక ఓపెనర్ల విషయానికొస్తే సెహ్వాగ్ పై వేటు నేపథ్యంలో ఢిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ అరంగేట్రం చేయొచ్చని తెలుస్తోంది. ఆసీస్ శిబిరంలో ప్రస్తుతం నిరుత్సాహం అలుముకుంది. కీలక ఆటగాళ్లు వేటుకు గురికావడం.. ఇప్పటికే సిరీస్ లో వెనుకంజలో ఉండడంతో మొహాలీ పోరు కూడా ఏకపక్షంగానే సాగుతుందని భావిస్తున్నారు.

ఆసీస్ జట్టు భారమంతా కెప్టెన్ క్లార్క్ పైనే ఉంది. క్లార్క్ విఫలం కావడంతో ఆ ప్రభావం జట్టు ప్రదర్శనపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కొవాన్, వార్నర్ లు శుభారంభం ఇస్తే.. మిడిలార్డర్ లో క్లార్క్ భారీ స్కోరు దిశగా జట్టును నడిపించాలని ఆసీస్ శిబిరం కోరుకుంటోంది.

ఇక భారత స్పిన్నర్లు సఫలమవుతున్న చోట తమ స్పిన్నర్లు నిస్సహాయులుగా మిగిలిపోవడం ఆసీస్ కు కొరుకుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి మరో ఆల్ రౌండ్ ప్రదర్శనను అభిమానులు ఆశిస్తున్నారు. 

  • Loading...

More Telugu News