: జగన్ ఓ మూర్ఖుడు: ఎంపీ గుత్తా
స్పీకర్ కు బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ నిన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన, గౌరవప్రదమైన పదవిలో ఉన్న స్పీకర్ పై నోటికొచ్చిన విధంగా మాట్లాడటం, అతని ముఠాతత్వానికి, ఫ్యాక్షనిజానికి నిదర్శనమని విమర్శించారు. జగన్ ఓ మూర్ఖుడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో అభిప్రాయాలు చెప్పకుండా... రాష్ట్రపతికి వైఎస్సార్సీపీ అఫిడవిట్లు దాఖలు చేయడం అర్థరహితమని ఎద్దేవా చేశారు. ఈ రోజు గుత్తా నల్గొండలో మీడియాతో మాట్లాడారు. మరో మూడు నాలుగు రోజుల్లో చంద్రబాబు సమన్యాయం నుంచి సమైక్యవాదానికి మారుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ నేతలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.