: రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాదులోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఈరోజు ఉదయం వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ భేటీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించామని జగన్ తెలిపారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇచ్చారని ఆయన చెప్పారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.
సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలందరూ కలసికట్టుగా అఫిడవిట్లు సమర్పించాలని జగన్ ఆకాంక్షించారు. కానీ, చంద్రబాబు అందుకు ముందుకు రావడం లేదంటూ ఆరోపించారు. శాసనసభలో విభజన బిల్లుపై చర్చకు తాము మద్దతివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలను మభ్యపెడుతున్నారని అన్నారు. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.